
సిద్దిపేట టౌన్,వెలుగు: దేశం కోసం వీర మరణం పొందిన జవాన్ల కుంటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. సోమవారం ఆయన పట్టణంలోని శివాజీ చౌక్ నుంచి లాల్ కమాన్ వరకు తిరంగా యాత్ర నిర్వహించారు. పహల్గాం దాడిలో అమరులైన వారిని, యుద్దంలో వీర మరణం పొందిన జవాన్లను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. ప్రపంచం మన శక్తి గురించి ఆలోచన చేస్తోందని, పదేండ్ల కాలంలో దేశం మేకిన్ ఇండియా పేరిట గుండు సూది నుంచి ఫిరంగి వరకు మనమే తయారు చేసుకున్నామన్నారు.
ఆడబిడ్డల సింధూరాన్ని తుడచాలని చూస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్‌ను లేకుండా చేస్తామన్నారు. మోదీ నాయకత్వంలో మేకలు కూడా పులుల వలె పోరాడుతాయనడానికి పహల్గాం ఘటన నిదర్శమనమన్నారు. భారత్‌మాతకి జై అంటూ జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో బిజేపీ నాయకులు, న్యాయవాదులు, ప్రజలు పాల్గొన్నారు.
ఏడేళ్లయినా పూర్తికాని ఐటీఐ భవనం: కాంట్రాక్టర్‌పై ఎంపీ ఆగ్రహం
దుబ్బాక: దుబ్బాకలో ఏడేళ్ల కింద రూ. 5 కోట్లతో నిర్మాణం మొదలుపెట్టిన ప్రభుత్వ ఐటీఐ భవనం ఇంకా పూర్తికాలేదు. అసంపూర్తిగా వదిలేసిన సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. దుబ్బాకలోని ఆ భవనాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఏడేళ్లుగా వినియోగంలోకి రాని ఐటీఐ భవనంతో స్టూడెంట్స్ఎంతమేర నష్టపోతున్నారనే విషయాన్ని జిల్లా అధికారులు ఆలోచన చేయాలన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి పాడుబడ్డ భవనంలా మారిన ఐటీఐ భవనంపై దృష్టి పెట్టాలన్నారు.
రాజకీయాలు పక్కనబెట్టి వచ్చే విద్యా సంవత్సరానికైనా స్టూడెంట్స్‌కు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర సాంకేతిక మంత్రి, జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. పక్కనే ఉన్న టాటా కన్సల్టెన్సీ ట్రైనింగ్ సెంటర్‌తో ఐటీఐ స్టూడెంట్స్‌కు బంగారు భవిష్యత్ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మంద అనిల్‌రెడ్డి, భిక్షపతి, సుభాష్ రెడ్డి, ప్రవీణ్, భాస్కర్, వెంకటేశ్, అశోక్, రాజేశ్ పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ
సంగారెడ్డి టౌన్: ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో సైనికులకు సంఘీభావంగా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరై మాట్లాడుతూ.. దేశం వైపు కన్నెత్తి చూస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సిందూర్ ఒక ఉదాహరణ అన్నారు. ప్రతి పౌరుడు భారత సైనికులకు సంఘీభావంగా నిలవాలన్నారు. ప్రధాని మోదీ స్వయంగా పాకిస్తాన్ పరిసర ప్రాంతాల్లోని రక్షణ ప్రాంతాలకు చేరుకొని సైనికులలో మనోస్థైర్యాన్ని నింపారన్నారు.
పాత బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం నుంచి ఐబీ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్, రమేశ్, రాజేశ్వరరావు, అనంతరావు, రాజశేఖర్ రెడ్డి, మాణిక్యరావు, ప్రతాపరెడ్డి, వెంకట నరసింహారెడ్డి, రాములు, విజయకుమార్, వాసు, నాగరాజు, రవి, ప్రవీణ్, సాయి రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు .